మ‌రో విషాదం.. రామాయణ్‌ ఫేం అరవింద్‌ త్రివేది క‌న్నుమూత‌

Ramayan Ravan Arvind Trivedi passed away.సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. 1980వ ద‌శ‌కంలో దూర‌ద‌ర్శ‌న్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2021 4:57 AM GMT
మ‌రో విషాదం.. రామాయణ్‌ ఫేం అరవింద్‌ త్రివేది క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. 1980వ ద‌శ‌కంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్రసార‌మైన అపురూప దృశ్య‌కావ్యం రామాయ‌ణ్ ధారావాహిక‌లో రావ‌ణుడిగా న‌టించిన అర‌వింద్ త్రివేది క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 82 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి గుండెపోటుతో మృతి చెందిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. త్రివేది ఇక‌లేర‌నే వార్త‌ను ఆయన సహనటుడు సుశీల్ లహిరి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశారు. ఇది విచారకరమైన వార్త అని, తమ ప్రియమైన అరవింద్ భాయ్ ఇక లేరని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన మరణ వార్త తెలిసిన ప‌లువురు బాలీవుడ్‌ టీవీ, సినీ నటీనటుల సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. బుధ‌వారం ఆయ‌న అంత్య‌క్రియ‌లో ముంబైలో జ‌ర‌గ‌నున్నాయి.

అరవింద్ మేనల్లుడు కౌస్తుబ్ త్రివేది మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని.. కనీసం నడవలేని స్థితిలో ఉన్నారన్నారు. గత రాత్రి 9.30 గంటల సమయంలో ఆయనకు గుండెనొప్పి వచ్చినట్టు తెలిపారు. ముంబైలోని తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు పేర్కొన్నారు.

అర‌వింద్ త్రివేది 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో హిందీ,గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. 300 చిత్రాల్లో న‌టించారు. 1991 నుంచి 1996 వరకు సబర్కథ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు. కరోనా లాక్‌డౌన్ కార‌ణంగా దూరదర్శన్‌ 'రామాయణ్‌'ను పున:ప్రసారం చేసింది. 2020 ఏప్రిల్‌ 16న తిరిగి ప్రసారమైన రామయణ్‌ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించడంతో సరికొత్త రికార్డు సృష్టించింది.

Next Story
Share it