వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరి మీద సినిమా తీసినా.. ఏ సినిమా తీసినా కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ ఉంటాడు. తన సినిమా రిలీజ్ ల విషయంలో దాదాపు వెనక్కు తగ్గడు. కానీ తాజాగా వర్మ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తన తాజా చిత్రం 'డి కంపెనీ' విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 'దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు... కొత్త లాక్ లాక్ డౌన్లపై నిరవధికంగా వస్తున్న వార్తల నేపథ్యంలో, మా 'డి కంపెనీ' విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలోనే ప్రకటిస్తాం' అని ఆయన ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయి, పాక్షిక లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా, థియేటర్లు, ఆడిటోరియంలు, కార్యాలయాలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీచేసింది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో దాదాపు 26 వేల పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో అధికారులు కూడా టెన్షన్ పడుతూ ఉన్నారు.