'కార్తికేయ 2' పై వ‌ర్మ ట్వీట్.. ఆ సినిమాలకంటే పెద్ద హిట్ ఇది

Ram Gopal Varma interesting tweet on Karthikeya 2 movie.నిఖిల్ హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2022 12:17 PM IST
కార్తికేయ 2 పై వ‌ర్మ ట్వీట్.. ఆ సినిమాలకంటే పెద్ద హిట్ ఇది

నిఖిల్ హీరోగా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'కార్తికేయ 2'. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌ కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఆగ‌స్టు 13 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా నార్త్‌లో అయితే త‌న హ‌వా చూపిస్తోంది. హిందీలో తొలి రోజు 50 స్క్రీన్ల‌లో మాత్ర‌మే విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌స్తుతం 3000 పైగా స్క్రీన్లలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుందంటేనే ఈ సినిమా ఎంత‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో తెలియ‌జేస్తుంది. ఇప్పటికే 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

తాజాగా ఈ చిత్రంపై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ సినిమాకు వ‌స్తున్న క‌లెక్ష‌న్లు చూస్తుంటే ఆర్ఆర్ఆర్ కంటే కూడా బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్ట‌ర్ ఇదేనంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా రాసుకొచ్చాడు. "నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రెండవ శుక్రవారం కూడా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షాబంధన్' కంటే డబల్ కలెక్షన్స్ సాధించింది. దీనిని బ‌ట్టి చూస్తుంటే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', ప్రశాంత్ నీల్ 'కెజిఎఫ్ 2' కంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. ద‌ర్శ‌కుడు చందు మొండేటీ, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌కు నా అభినంద‌న‌లు" అని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

కాగా.. వ‌ర్మ ట్వీట్‌పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. 'కార్తికేయ 2' బిగ్ హిట్ కావొచ్చు. కానీ 'ఆర్ఆర్ఆర్', 'కెజిఎఫ్ 2' సినిమాల కంటే పెద్ద హిట్ అయిందని ఎందుకన్నాడనే విషయం మీద చర్చ జరుగుతోంది.

Next Story