మా అధ్య‌క్ష ఎన్నిక‌లు.. నాన్‌లోక‌ల్ వివాదంపై రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు

Ram Gopal Varma Comments on NON Local Issue.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jun 2021 5:10 AM GMT
మా అధ్య‌క్ష ఎన్నిక‌లు.. నాన్‌లోక‌ల్ వివాదంపై రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ ప‌డుతున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ఇప్ప‌టికే త‌న ప్యానెల్‌కు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. ప్ర‌కాశ్ రాజ్ నాన్‌లోక‌ల్ అని.. మా ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు పోటీ చేసే అర్హ‌త లేద‌ని ప‌లువురు ఇండ‌స్ట్రీకి చెందిన స‌భ్యులు వ్యాఖ్య‌లు చేయ‌గా.. ప్ర‌కాశ్ రాజ్ కూడా అంతే ధీటుగా స‌మాధానం చెప్పాడు. ఇదిలా ఉంటే.. నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ దీనిలో ఎంట‌ర్ అయ్యాడు. క‌ర్ణాట‌క నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చిన ప్ర‌కాశ్‌రాజ్ నాన్ లోక‌ల్ అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై వెళ్లిన రామారావు, నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ ఎలా లోక‌ల్ అవుతారని ప్ర‌శ్నించారు.

'క‌ర్ణాట‌క నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చిన ప్ర‌కాశ్‌రాజ్ నాన్‌లోక‌ల్ అయితే.. గుడివాడ నుంచి చెన్నైకి వెళ్లిన రామారావు, నాగేశ్వ‌ర‌రావు, బుర్రిపాలెం నుంచి మద్రాస్ వెళ్లిన కృష్ణ‌, తిరుప‌తి నుంచి మ‌ద్రాస్ బ‌య‌ల్దేరిన మోహ‌న్ బాబు లోక‌లా..? మ‌హారాష్ట్ర నుంచి ఎక్క‌డెక్క‌డికో వెళ్లిన ర‌జ‌నీకాంత్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి మ‌హారాష్ట్ర‌కి వెళ్లిన అమితాబ్ బ‌చ్చ‌న్ లోక‌లా..? ముప్పై ఏళ్లుగా ఇక్క‌డే ఉండి తెలుగు నేర్చుకుని చ‌లం పుస్త‌కాల‌ని ముద్రించి, భార్యాపిల్ల‌ల‌తో ఇక్క‌డే ఉంటూ.. తెలంగాణ‌లో ఒక గ్రామాన్ని ద‌త్తత తీసుకుని అక్క‌డున్న ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ప‌ని క‌ల్పిస్తున్న ఆయ‌న నాన్‌లోక‌లా..? ప్ర‌కాశ్‌రాజ్‌లోని ప్ర‌తిభ గుర్తించిన ఈ దేశం నాలుగుసార్లు ఆయ‌న్ని శాలువా క‌ప్పి జాతీయ అవార్డుతో స‌త్క‌రిస్తే.. ఇప్పుడు అదే వ్య‌క్తిని నాన్‌లోక‌ల్ అంటున్నాం' అని రామ్‌గోపాల్ వ‌ర్మ వ‌రుస ట్వీట్లు చేశారు.

Next Story
Share it