కుదిరిన రాజీ.. వివాదానికి చెక్ పెట్టిన వర్మ, నట్టికుమార్
Ram Gopal Varma and Natti kumar compromised.దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ల మధ్య తలెత్తిన
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2022 10:59 AM IST
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ల మధ్య తలెత్తిన వివాదం సమసిపోయింది. నిన్నటి దాకా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ,కేసులు పెట్టుకున్న ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. తమ మధ్య ఏర్పడ్డ అపార్థాలు పూర్తిగా తొలగిపోయాయని, ఒకరి పై మరొకరు పెట్టుకున్న కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇద్దరూ కలిసి ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
అసలేం జరిగిందంటే..?
'మా ఇష్టం' సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో వర్మ, నట్టి కుమార్ ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వర్మ 'డేంజరస్' సినిమా విడుదల సమయంలో నట్టి ఎంటర్‌టైన్‌మెంట్స్ కు చెందిన నట్టిక్రాంతి కుమార్, నట్టి కరుణ కోర్టును ఆశ్రయించారు. తమకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేస్తున్నారని పిటిషన్ వేశారు. కోర్టు ద్వారా డేంజరస్ సినిమా విడుదల పై స్టే విధించింది. దీంతో వర్మ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ గత నెలలో నట్టి క్రాంతి, కరుణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్ కాపీ చేసి, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు.
ఇదంతా జరుగుతుండగానే ఊహించని రీతిలో యూ టర్న్ తీసుకున్నారు రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్. తాము కలిసిపోయామంటూ ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. వర్మ మాట్లాడుతూ.. కొన్ని పరిస్థితుల వల్లే నట్టి కుటుంబంపై కేసు పెట్టాల్సి వచ్చిందని, అంతేతప్ప వారిపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. ఇక నట్టి కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ మధ్య ఏర్పడిన అపార్థాలు, అపోహలు తొలగిపోయాయన్నారు. తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అన్నారు. కొందరు వ్యక్తుల కారణంగా తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, ఇప్పుడవన్నీ సమసిపోయాయని వివరించారు.ఇరువురం పెట్టుకున్న కేసులన్నీ వాపస్ తీసుకుంటున్నామని చెప్పారు.
No permanent enemies in films and politics pic.twitter.com/2AloxjdHbr
— Ram Gopal Varma (@RGVzoomin) June 11, 2022