ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ర‌కుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh enters at ED Office.టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో 12 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2021 4:58 AM GMT
ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ర‌కుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో 12 మంది ప్రముఖులకు ఈడీ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్‌ విభాగానికి చెందిన సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. వీటికి సంబంధించి విచారణకు హాజరుకావాలని 10 మంది టాలీవుడ్‌ ప్రముఖులు సహా 12 మందికి నోటీసులు పంపింది. వీరిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, రకుల్‌ప్రీత్‌ సింగ్, చార్మి, రవితేజ, నవ్‌దీప్, ముమైత్‌ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాస్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కూడా ఉన్నారు.

కాగా.. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, న‌టి ఛార్మిల‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. నేడు(శుక్ర‌వారం) ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైంది. చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదితో కలిసి రకుల్‌ ఈడీ ఆఫీసుకు చేరుకుంది. మ‌నీ లాండ‌రింగ్ కోనంలో ఆమె బ్యాంక్ ఖాతాల‌ను అధికారులు ప‌రిశీలించ‌నున్నారు.


వాస్త‌వానికి ఈ నెల 6న ఈడీ ఎదుట ర‌కుల్ హాజ‌రు కావాల్సి ఉంది. అయితే.. షూటింగ్స్ ఉండ‌డం వ‌ల్ల ఆ రోజు తాను హాజ‌రు కాలేన‌ని.. త‌న‌కు కాస్త స‌మ‌యం ఇవ్వాల‌ని ఈడీ అధికారుల‌ను ర‌కుల్ కోరింది. అందుకు అంగీక‌రించని ఈడీ అధికారులు మూడు రోజుల ముందుగానే విచార‌ణ చేసేందుకు రంగం సిద్దం చేశారు. దీంతో నేడు ఆమె ఈడీ ఎదుట హాజ‌ర‌య్యారు. ఎన్ని గంట‌ల పాటు విచారిస్తారు. ఏయే విష‌యాల‌పై ఆమెను ప్ర‌శ్నించ‌నున్నారు అనే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కాగా.. గురువారం ఛార్మీని 8 గంట‌ల పాటు ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. అవ‌స‌ర‌మైతే మ‌రో సారి తాను విచార‌ణ‌కు హాజ‌రు అవుతాన‌ని చార్మీ తెలిపింది.

8న రానా, 9న రవితేజతోపాటు శ్రీనివాస్, 13న నవదీప్‌తోపాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజ‌రుకానున్నారు.

Next Story