షెర్లిన్‌ చోప్రా ఫిర్యాదు.. నటి రాఖీ సావంత్‌ అరెస్ట్‌

Rakhi Sawant detained in case filed by Sherlyn Chopra. నటి షెర్లిన్ చోప్రా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మేరకు నటి రాఖీ సావంత్‌ను పోలీసులు

By అంజి  Published on  19 Jan 2023 4:17 PM IST
షెర్లిన్‌ చోప్రా ఫిర్యాదు.. నటి రాఖీ సావంత్‌ అరెస్ట్‌

నటి షెర్లిన్ చోప్రా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ మేరకు నటి రాఖీ సావంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. రాఖీ సావంత్‌ తన భర్త ఆదిల్ దుర్రానీతో కలిసి జనవరి 19 మధ్యాహ్నం 3 గంటలకు తన డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇవాళే ఆమెను అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాఖీ అరెస్టు గురించి షెర్లిన్ చోప్రా ట్విట్టర్‌లో అందరికీ తెలియజేసింది. తనపై అభ్యంతరకర భాష వాడినందుకు అరెస్ట్‌ చేశారని తెలిపింది. ఆమె ట్వీట్ చేస్తూ.. "అంబోలి పోలీసులు FIR 883/2022కి సంబంధించి రాఖీ సావంత్‌ను అరెస్టు చేశారు. నిన్న రాఖీ సావంత్ ABA 1870/2022ను ముంబై సెషన్ కోర్టు తిరస్కరించింది" అని పేర్కొన్నారు.

గత సంవత్సరం సాజిద్‌ ఖాన్‌ విషయంలో షెర్లిన్‌ చోప్రా, రాఖీ సావంత్‌ మధ్య పెద్ద వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. నెట్టింట ఒకరిపై ఒకరు తెగేసి విమర్శలు చేసుకున్నారు. మీటూ వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్‌ నటుడు సాజిద్‌ ఖాన్‌పై షెర్లిన్‌ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 29న సాజిద్ ఖాన్‌కు వ్యతిరేకంగా తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత, షెర్లిన్ మీడియాతో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ చిత్రనిర్మాతను కాపాడుతున్నారని ఆరోపించారు. అయితే షెర్లిన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన రాఖీ.. సాజిద్‌ను సమర్థించింది. రాఖీ మాట్లాడుతూ.. ఏ ఫిర్యాదులో మెరిట్ ఉందో, ఏది లేదో పోలీసులకు తెలుసునని అన్నారు. ఆ తర్వాత షెర్లిన్ రాఖీపై పరువునష్టం ఆరోపణలపై ఫిర్యాదు చేసింది.

Next Story