సూపర్ స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి ఆ తరువాత వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి అని చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి తాజాగా రజనీకాంత్ సమాధానం చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితుల కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రజనీకాంత్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను గత కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి వస్తే ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే.. అది తన ఆరోగ్యానికి మంచిది కాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ సలహా ఇచ్చినట్లు రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.
కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు తెలిపారు. ఆ సమయంలో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. అందుకనే రాజకీయాల నుంచి వైదొలిగానని చెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎక్కడా బయటపెట్టలేదన్నారు.
దేవుడు ఉన్నాడని చెప్పిన రజనీకాంత్.. లేడు అనే వారు కనీసం ఒక్క రక్తపు బొట్టునైనా తయారు చేసి చూపించాలని సవాలు విసిరారు.