కలెక్షన్స్‌లో రజనీకాంత్ 'జైలర్' సినిమా రికార్డులు
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం 'జైలర్' సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Aug 2023 5:50 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం 'జైలర్' సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో రజనీ మూవీ జైలర్ దూసుకుపోతుంది. సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా నటీనటులు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీశ్రాఫ్ వంటి అద్భుత నటులు ఈ సినిమాలో రజనీకాంత్ పక్కన కీలక పాత్రల్లో కనిపించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమాలో రజనీకాంత్ తో కలిసి నటించారు హీరోయిన్ రమ్యకృష్ణ.
ఈ సినిమాను తీసింది తమిళంలో అయినప్పటికీ మిగతా భాషల్లో కూడా విడుదల చేయడంతో దేశం అంతటా ఉన్న రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. రిలీజ్ అయ్యి ఐదు రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. రజనీకాంత్ సినిమా దేశమంతటా కూడా చూడటానికి ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా జైలర్ సినిమాకు ముందు వచ్చిన ఆయన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడంతో జైలర్ సినిమా మీద ముందు నుండి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే మొత్తానికి ఆగస్టు 15తో ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 350 కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం విశేషం.
విడుదలైన నాలుగు రోజుల్లోనే ఇన్ని వందల కోట్లు సంపాదించిన రజనీకాంత్ సినిమా ఇప్పటివరకు లేదు. అది మాత్రమే కాకుండా, ఇప్పటివరకు తమిళనాడులో విడుదలైన ఎన్నో సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ జైలర్ సినిమా దూసుకుపోతోంది. ఇదేవిధంగా ఇంకో నాలుగు రోజులు థియేటర్లో సినిమా నడిపితే దాదాపు 500 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసే సత్తా జైలర్ సినిమాకు ఉందంటున్నారు సినిమా విశ్లేషకులు. రజనీకాంత్ యాక్షన్ సినిమాలు చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తారు. ప్రస్తుతం జైలర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగను తీసుకొచ్చిందనే చెప్పాలి.