చెన్నై టు అమెరికా.. పయనమయిన రజినీకాంత్

Rajinikanth heads to US for general health check-up.త‌మిళ‌ సూపర్ స్టార్ రజనీకాంత్ శ‌నివారం ఉద‌యం అమెరికా బ‌య‌లుదేరారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2021 5:46 AM GMT
చెన్నై టు అమెరికా.. పయనమయిన రజినీకాంత్

త‌మిళ‌ సూపర్ స్టార్ రజనీకాంత్ శ‌నివారం ఉద‌యం అమెరికా బ‌య‌లుదేరారు. సాధార‌ణ ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆయ‌న యూఎస్ వెలుతున్న‌ట్లు స‌మాచారం. మే 2016లో రజినికి మూత్రపిండాల వ్యాధి కారణంగా అమెరికాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌లో నిపుణుల బృందం కిడ్నీ మార్పిడి చేశారు. తరువాత నుంచి ఆయన అదే ఆసుపత్రిలో ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా రజినీ.. అమెరికా వెళ్ళలేకపోయారు.

క‌రోనా కార‌ణంగా విదేశాల‌కు వెళ్లేందుకు ఆంక్ష‌లు ఉన్నాయి. దీంతో ర‌జ‌నీకాంత్ త‌న ఆరోగ్య ప‌రిస్థితి దృష్ట్యా అమెరికా వెళ్ల‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరారు. కేంద్రం ఇందుకు అనుమ‌తి ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈరోజు ఉదయం తన భార్య తో కలిసి చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ర‌జ‌నీకాంత్ అమెరికాకు బయలుదేరారు. ఈ స్పెషల్ ఫ్లైట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమెరికా వెళుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న అల్లుడు ధనుష్, కూతురు అమెరికాలో ఉన్నారు. హాలీవుడ్ సినిమా ది గ్రేట్ మ్యాన్ షూటింగ్ నిమిత్తం అల్లుడు ధనుష్ కూతురు ఐశ్యర్య అమెరికాలోనే ఉన్నారు.

ఇక ఆయన నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జనీ స‌ర‌సన న‌య‌న‌తార న‌టిస్తోంది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది. వ‌చ్చే నెల నుంచి 'అన్నాత్తే' చిత్ర షూటింగ్ పునఃప్రారంభం కానుంది.

Next Story