త్రిష వివాదంపై నోరు విప్పిన పార్థిబన్.. 'నా ఉద్దేశం అది కాదు అంటూ..'

చెన్నై: ఇటీవల ఒక అవార్డు వేడుకలో నటి త్రిషను ఉద్దేశించి "ఈ కుందవై (పొన్నియిన్ సెల్వన్‌లోని త్రిష పాత్ర) కొన్నాళ్లు ఇంట్లోనే కూర్చుంటే (కుంతవైక్కిరతు) మంచిది" అని నటుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.

By -  అంజి
Published on : 10 March 2026 10:17 AM IST

R Parthiban, Trisha Krishnan, Kundhavai Controversy, Ponniyin Selvan, Thalapathy Vijay, Kollywood News 2026, Cyber War, Award Show Controversy

త్రిష వివాదంపై నోరు విప్పిన పార్థిబన్.. 'నా ఉద్దేశం అది కాదు అంటూ..'

చెన్నై: ఇటీవల ఒక అవార్డు వేడుకలో నటి త్రిషను ఉద్దేశించి "ఈ కుందవై (పొన్నియిన్ సెల్వన్‌లోని త్రిష పాత్ర) కొన్నాళ్లు ఇంట్లోనే కూర్చుంటే (కుంతవైక్కిరతు) మంచిది" అని నటుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీనికి త్రిష స్పందిస్తూ, "మైక్రోఫోన్ ఉండగానే సరిపోదు, చేసే వ్యాఖ్యల్లో విజ్ఞత ఉండాలి. అది లేనప్పుడు మూర్ఖత్వం మరింత గట్టిగా వినిపిస్తుంది" అని ఘాటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో పార్థిబన్ దాదాపు 8 నిమిషాల నిడివి గల వీడియోతో తన వివరణ ఇచ్చారు.

తాను కావాలని ఎవరినీ అవమానించలేదని పార్థిబన్ స్పష్టం చేశారు. "తప్పుకు, నేరానికి చాలా తేడా ఉంది. నేను విజయ్, అజిత్ గురించి మాట్లాడుతున్నప్పుడు అకస్మాత్తుగా స్క్రీన్ మీద త్రిష ఫోటో కనిపించింది. ఆ సమయంలో యాంకర్ ప్రియాంక 'కుందవై' గురించి ప్రస్తావించడంతో నేను అలా స్పందించాల్సి వచ్చింది. అంతే తప్ప, త్రిష ఫోటో వేయమని నేనే కోరానన్న ప్రచారంలో నిజం లేదు" అని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో విజయ్ రాజకీయ ప్రస్థానం మరియు త్రిష ఒక వివాహ వేడుకకు హాజరైన అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తన మనసులో ఉందని, ఆ ఆవేదనతోనే "సమస్యలు రాకుండా ఉండాలంటే ఆమె ఇంట్లో ఉండటం మంచిది" అని అన్నానని వివరించారు.

తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ, ఆ వీడియో క్లిప్‌ను తొలగించాలని నిర్వాహకులను కోరినట్లు పార్థిబన్ తెలిపారు. అయితే, త్రిష తనను ఉద్దేశించి చేసిన ట్వీట్‌ను ఆయన తప్పుబట్టారు. "ఒక థర్డ్ పర్సన్ (త్రిష) చేసిన థర్డ్ రేట్ ట్వీట్ నన్ను బాధించింది" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో త్రిషపై రాజకీయ నాయకుల నుండి అసభ్యకర విమర్శలు వచ్చినప్పుడు ఆమె ఇంతలా స్పందించి ఉంటే తాను స్వాగతించేవాడినని, కానీ తన విషయంలో ఆమె స్పందించిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు.

తమ మధ్య జరిగిన ఈ వివాదంపై స్పందిస్తూ.. తాను ఎవరికీ బానిసను కాదని, డబ్బు కోసం లేదా రాజకీయాల కోసం తన వ్యక్తిత్వాన్ని రాజీ పడబోనని పార్థిబన్ స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం రోజున తాను మహిళలను గౌరవించే వ్యక్తిగా ఉండాలనుకుంటానని, కానీ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన ముగించారు.

Next Story