రెండు భాగాలుగా 'పుష్ప‌'.. షాక్‌లో అభిమానులు..?

Pushpa Movie release in two parts.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంద‌ట‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 May 2021 6:26 AM GMT
Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా.. గ్రామీణ యువ‌తిగా ర‌ష్మిక అల‌రించ‌నుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చాలా బాగం పూర్తికాగా.. ఇటీవ‌ల అల్లు అర్జున్‌కు క‌రోనా సోక‌డంతో ప్ర‌స్తుతం ఆయ‌న హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం గురించి సోష‌ల్ మీడియాలో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే..? ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా న‌డ‌వ‌నుంద‌ట‌. దీంతో నిడివి చాలా పెరిగే అవ‌కాశం ఉంద‌ట‌. ఒక‌వేళ నిడివి త‌గ్గిస్తే.. సుకుమార్ చెప్ప‌ద‌లుచుకున్న అంశాల‌ను స‌రిగ్గా చెప్పే అవ‌కాశం ఉండ‌ద‌ని.. దీంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని సుకుమార్ నిర్ణ‌యించుకున్న‌ట్లు ఓ రూమ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది. కాగా.. తొలి భాగాన్ని ఈ ద‌స‌రాకి విడుద‌ల చేసి రెండో భాగాన్ని 2022 వేస‌విలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆ వార్త సారాంశం. కాగా.. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

ఇక ఈ చిత్రంలో బ‌న్నీచెల్లి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ న‌టిస్తుండ‌గా.. విల‌న్‌గా ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుదల చేయ‌గా.. అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. కేవ‌లం నెల‌రోజుల్లోనే 62 మిలియ‌న్ల వ్యూస్ రాబ‌ట్టి.. టాలీవుడ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలో అత్య‌ధిక వ్యూస్ పొందిన చిత్రంగా నిలిచింది.


Next Story