పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం.. 'జేమ్స్' టీజర్ విడుదల
Puneeth Rajkumar last movie James teaser release.కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినీ
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2022 1:38 PM ISTకన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినీ ప్రపంచాన్ని ఎంతో కలచివేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జేమ్స్' చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఇక పునీత్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జేమ్స్' చిత్రాన్ని మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ క్రమంలో ఈ చిత్ర టీజర్‌ను నేడు విడుదల చేసింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో.. పునీత్ చేసిన యాక్షన్ స్టంట్స్ వీక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. 'ఈ ప్రపంచంలో మొత్తం మూడు మార్కెట్లు ఉన్నాయి. ఓపెన్ మార్కెట్, డీప్ మార్కెట్, డార్క్ మార్కెట్. ఇది వరల్డ్ మాఫియా' అనే డైలాగ్‌లతో టీజర్ ప్రారంభమైంది. సెక్యూరిటీ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న జేమ్స్ అకా సంతోష్ కుమార్ అనే పాత్రలో పునీత్ నటిస్తున్నారు. 'నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే' అలవాటు అంటూ టీజర్ చివరల్లో పునీత్ చెప్పే డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్, శరత్‌కుమార్‌లు కీలక పాత్రల్లో నటించారు.
కాగా.. ఈ చిత్ర పోస్ట్ ప్రొడెక్షన్ పనుల్లో ఉన్న సమయంలోనే పునీత్ కన్నుమూశారు. దీంతో ఈ చిత్రంలో పునీత్ పాత్రకు ఆయన సోదరుడు శివకుమార్ డబ్బింగ్ చెప్పారు. పునీత్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17న థియేటర్లలోకి ఈ చిత్రం వస్తోంది. పునీత్ రాజ్ కుమార్‌ను జయంతిని మరింత ప్రత్యేకంగా చేయడానికి, ఆయనను గౌరవించటానికి కర్ణాటక మూవీ డిస్ట్రిబ్యూటర్లు మార్చి 17 నుండి 23 వరకు ఒక వారం పాటు అక్కడ మరే ఇతర చిత్రాన్ని విడుదల చేయకూడదని ప్లాన్ చేస్తున్నారట.