మా కుటుంబం ఎదుగుదల చూడలేకనే.. అతన్ని వదిలే ప్రసక్తే లేదు
Producer Bellamkonda Suresh pressmeet.బెల్లంకొండ సురేశ్, ఆయన కొడుకు సాయి శ్రీనివాస్ 2018లో రూ.85లక్షలు తన దగ్గర
By తోట వంశీ కుమార్
బెల్లంకొండ సురేశ్, ఆయన కొడుకు సాయి శ్రీనివాస్ 2018లో రూ.85లక్షలు తన దగ్గర నుంచి తీసుకుని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదంటూ బంజారాహిల్స్‌లో నివసించే వ్యాపారి శ్రవణ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సురేశ్, సాయిశ్రీనివాస్‌పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై శనివారం ఫిలిం ఛాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు బెల్లంకొండ సురేష్.
'శ్రవణ్ ఉద్దేశ్యం నన్ను బ్యాడ్ చేయడమే. ఎలాంటి ఆధారాలు లేకుండానే నాతో పాటు నా కుమారుడిపై కేసు పెట్టాడు. శ్రవణ్‌ను న్యాయపరంగానే ఎదుర్కొంటా. రూ.85లక్షలు ఇచ్చినట్లుగా ఏదైన సాక్ష్యాలు ఉంటే చూపించమనండి. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు. శ్రవణ్ వెనుక ఓ రాజకీయ నేత ఉన్నాడు. అతడే ఇదంతా చేయిస్తున్నాడు. త్వరలోనే ఆ పెద్ద మనిషి ఎవరో మీ అందరికీ ఆధారాలతో సహా చెబుతా.
ఇక ఈ కేసులో సాయి శ్రీనివాస్‌ను కావాలని ఇరికించారు. ఇప్పుడిప్పుడే సాయి కెరీర్‌లో స్థిరపడుతున్నాడు. తన ఇమేజ్‌కి భంగం కలిగించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారు. నా పిల్లలే నాకు పంచ ప్రాణాలు. అలాంటిది శ్రవణ్.. నా పిల్లల మీదకు వచ్చాడు. అతడిని వదిలిపెట్టను. న్యాయపరంగానే అతడి ఎదుర్కొంటా. నేను డబ్బులు తీసుకున్నట్లు నిరూపించకపోతే అతడిపై పరువు నష్టం దావా వేస్తా. అలాగే క్రిమినల్ కేసులు కూడా పెట్టిస్తా. ఇంకా.. కేసు విషయమై కోర్టు లేదా పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తా' అని సురేశ్ అన్నారు.