ఒక్క రోజులో తీసుకున్న నిర్ణ‌యం కాదు.. ఆవేద‌న‌తో పుట్టిన ప్యాన‌ల్ ఇది

Prakash Raj speech about MAA Elections.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2021 6:58 AM GMT
ఒక్క రోజులో తీసుకున్న నిర్ణ‌యం కాదు.. ఆవేద‌న‌తో పుట్టిన ప్యాన‌ల్ ఇది

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ ప‌డుతున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ఇప్ప‌టికే త‌న ప్యానెల్‌కు కూడా ప్ర‌క‌టించారు. అయితే.. ఆయ‌న్ను ప‌ర‌భాషా వ్య‌క్తి అని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. దీనిపై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ స్పందించారు. మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నేది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణ‌యం కాద‌న్నారు.

నాలుగైదు రోజులుగా మీడియాలో వ‌స్తున్న ఊహాగానాలు చూస్తుంటే చాలా భ‌యం వేస్తుంద‌న్నారు. మా ఎన్నిక‌ల్లో రాజ‌కీయ నాయ‌కులు కూడా భాగ‌మ‌వుతున్నారంటూ కొన్ని చోట్ల వార్త‌లు వ‌చ్చాయ‌న్నారు. మా లో పోటి చేయాల‌నేది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణ‌యం కాద‌న్నారు. రెండేళ్ల నుంచే ఆలోచిస్తున్నానని తెలిపారు. గ‌డిచిన ఏడాది కాలంగా ప్యాన‌ల్‌లో ఎవ‌ర్ని తీసుకోవాలి..? చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి..? అనే ప్ర‌ణాళిక సిద్దం చేసుకున్న‌ట్లు వివ‌రించారు.

నా ప్యానల్ లో నలుగురు ప్రెసిడెంట్ అభ్యర్థులు ఉన్నారని..ఇక్కడ అందరూ కలిసి పనిచేసి తోటివారికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. నేను తప్పుచేస్తే నన్నే బయటికి పంపిస్తారన్నారు. ప్రతి రోజు పెద్దలతో మాట్లాడుతున్నామని, పదవి కోసం ఇక్కడకు రాలేదన్నారు. నాకు ఇక్కడ అందరూ మిత్రులేనన్నారు. నాకు ప్రశ్నించే వాళ్ళు కావాలి.. నిలదీసే వాళ్ళు కావాలి అనుకుంటే.. అలాంటి వాళ్ళే మా ప్యానెల్ సభ్యులుగా ఉన్నారన్నారు. మా ప్యానల్ లో అందరూ కష్టపడి ఎదిగిన వాళ్లే ఉన్నారని.. మా ను క్లీన్ చేస్తామన్నారు.

సినిమా అనేది ఒక భాష. మన ఆలోచన విశ్వజనీయంగా ఉండాలి. అంతే తప్ప- వీడు మనోడు.. వీడు వేరేవాడు అనే ఆలోచనే తప్పు. ఇప్పుడు లోకల్‌.. నాన్‌లోకల్‌ అని మాట్లాడుతున్నవారికి.. నేను తెలంగాణలో కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొన్నప్పుడు నాన్‌లోకల్‌ అనిపించలేదా? నా అసిస్టెంట్లకు హైదరాబాద్‌లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్‌ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు ఇక్కడే స్కూలుకు వెళ్తాడు. నా ఆధార్‌ కార్డ్‌ అడ్రస్సు ఇక్కడే ఉంది. మ‌రి నేను నాక్ లోక‌ల్ ఎలా అవుతాను? అంతఃపురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్‌లోకల్‌ కాలేదే! నవనందులు తీసుకున్నప్పుడు నాన్‌లోకల్‌ కాలేదే! అప్పుడు లేని విషయం ఇప్పుడు ఎలా వచ్చింది..? ఈ కామెంట్స్‌ చేసేవారి సంకుచిత మనస్తత్వం, వారి స్థాయి, వారి మానసిక పరిస్థితిని మనం గమనించాలి అని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు.

'ప్ర‌స్తుతం ఎంతో క్లిష్ట స‌మ‌యం. మ‌న గృహాన్ని ఇక‌పై మ‌న‌మే మ‌రింత శుభ్రం చేసుకోవాలి. నేను అడిగాన‌ని కాదు.. అర్హ‌త చూసి ఓటు వేయ‌డండి.. ప్ర‌ణాళిక‌లు సిద్దం చేశాం. ప్ర‌తి దానికి లెక్క‌లు చూపిస్తాం. మీరంద‌రూ ఆశ్చ‌ర్య‌ప‌డేలా మేము ప‌నిచేస్తాం. ఎల‌క్ష‌న్ డేట్ ప్ర‌క‌టించే వ‌ర‌కూ మా ప్యానల్‌లోని ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రారు' అని ప్ర‌కాశ్ రాజ్ తెలిపారు.

Next Story