ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సువర్ణలత (86) సోమవారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ, వయసు రీత్యా ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సువర్ణలత పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచగా, సినీ , రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌ను పరామర్శిస్తున్నారు.
ఆమె అంత్యక్రియలు ఈరోజు (సోమవారం) సాయంత్రం బెంగళూరులో నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రకాశ్ రాజ్ తన తల్లితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉండేవారు. అనేక సందర్భాల్లో తన ఎదుగుదలలో ఆమె పాత్రను గుర్తు చేసుకునేవారు. ప్రకాష్ రాజ్ తల్లి మరణించిందన్న వార్త తెలియగానే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.