మా ఎన్నికలు.. విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు
Prakash Raj complains on Vishnu Panel.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా
By తోట వంశీ కుమార్ Published on 5 Oct 2021 5:45 AM GMTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానని చెప్పిన బండ్ల గణేష్.. అధ్యక్ష పదవి కోసం నిలిచిన సీవీఎల్ సైతం తమ నామినేషన్స్ ఉపసంహరించుకోగా.. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మాత్రమే పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తమ తమ ప్యానల్ సభ్యులను ప్రకటించారు కూడా. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు.
ఇప్పటికే ఇరు ప్యానల్ సభ్యులు పలువురు ప్రముఖులను కలిసి.. తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల అధికారికి మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానల్ ఉల్లంగిస్తోందని ఆరోపించారు. మా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుందన్నారు.
అనంతరం మీడియాలో సమావేశంలో ప్రకాశ్‌రాజ్‌మాట్లాడుతూ.. 60 ఏళ్లకు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులని.. దీన్ని అవకాశంగా చేసుకుని ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ల కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానల్ సంతకాలు సేకరిస్తోందన్నారు. ఓవ్యక్తి నిన్న సాయంత్రం విష్ణు తరుపున 56 మంది సభ్యుల తరుపున రూ.28 వేలు కట్టారన్నారు. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు అని ప్రశ్నించారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల తరుపున పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరుపు వ్యక్తే కట్టారన్నారు. ఆగంతుకులతో మా ఎన్నికలు నిర్వహిస్తామా..? ఇలా గెలుస్తారా..? మీ హామీలు చెప్పి గెలవరా..? ఇంత దిగజారుతారా..? ఈ విషయంపై పెద్దలు కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలని ప్రకాశ్ రాజ్ అన్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో ఈవీఎం లకు బదులు బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని మంచు విష్ణు ఎన్నికల అధికారికి లేఖ రాసినట్లు సమాచారం. ఈవీఎంల పనితీరుపై తమకు నమ్మకం లేదనీ, అందుకే బ్యాలెట్ పేపర్‌నే ఉపయోగించాలనీ ఆ లేఖలో విష్ణు కోరారు. అయితే.. ఈవీఎం ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని మరో అభ్యర్ధి ప్రకాశ్‌రాజ్ వర్గం పట్టు పడుతున్నట్లు సమాచారం. మరీ వీటిపై ఎన్నికల అధికారి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.