ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ ఇదే
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది.
By అంజి Published on 21 July 2023 6:47 AM ISTప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది.. టైటిల్ ఇదే
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్ కూడా ప్రకటించారు. అమెరికాలోని శాండియాగో కామిక్ కాన్ 2023 వేదికగా సినిమా పేరు, వీడియో విడుదల చేశారు. అదే టైంలో సోషల్ మీడియాలో టైటిల్, గింప్స్ విడుదల చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించిన తొలి భారతీయ మూవీగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' టైటిల్‌ని చిత్రయూనిట్ ఖరారు చేసింది. ప్రభాస్, రానా, కమల్‌హాసన్, దీపికా పదుకునే, అశ్వనీదత్ తదితరులు ఈ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు.
ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని 'కల్కి' టీజర్‌లో చెప్పారు. ఆ శక్తిగా ప్రభాస్‌గా చూపించారు. ఈ సినిమాలో టైమ్ ట్రావెల్ ఉంటుందని ఓ హింట్ కూడా ఇచ్చారు. హీరోయిన్ దీపికా పదుకోన్ సీన్లు కూడా చూపించారు. 'వాటీజ్ ప్రాజెక్ట్ కె' అనే ఒకే ఒక్క డైలాగ్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేలా యాక్షన్ సీన్లు ఉన్నాయి. వీడియోలో విజువల్స్ అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. ప్రభాస్ లుక్ కూడా అదిరిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. 'కల్కి' టీమ్ రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే... ప్రపంచమంతా తనను దేవుడిగా కొలవాలని, ప్రజలను బానిసలుగా చేసిన దుష్టశక్తిని ఎదిరించిన సమరయోధుడిగా ప్రభాస్ వీరోచిత పోరాటం చేయనున్నారని తెలుస్తోంది.
'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'కి దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. అగ్ర నటులు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుండగా, దిశా పటానీ కీ రోల్ ప్లే చేస్తోంది. వైజయంతి మూవీస్ పతాకంపై దీనిని సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సుమారు 400 కోట్ల నిర్మాణ వ్యయంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.