'బాహుబలి' తర్వాత ప్రభాస్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాలార్', 'ప్రాజెక్ట్ కె' చిత్రాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాల్లో 'ప్రాజెక్ట్-కె'పై భారీ బజ్ ఉంది. 'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల అంచనాలకు అవధులు లేకుండా పోయాయి. 'ప్రాజెక్ట్-కె'లో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తోంది. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అందుకోసం హాలీవుడ్ నుంచి పలువురు యాక్షన్ దర్శకులు ఈ సినిమాకి పని చేయబోతున్నారని తెలుస్తోంది.మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో ఐదు యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయి. ఈ సన్నివేశాలకు హాలీవుడ్‌కి చెందిన యాక్షన్ ఎక్స్‌పర్ట్‌లు కొరియోగ్రఫీ చేస్తారని సమాచారం. అయితే ఒక్క స్టంట్ మాస్టర్ మాత్రం అన్ని యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేయడం అసాధ్యమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ సీన్స్ కోసం నలుగురైదుగురు యాక్షన్ డైరెక్టర్స్ పని చేస్తారని సమాచారం.
ఈ సినిమాకు మహాభారతానికి సంబంధించిన అనుబంధాలు కూడా ఉంటాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అమితాబ్ పాత్ర అశ్వత్థామ పాత్ర నుండి ప్రేరణ పొందింది. బిగ్ బిపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించినట్లు సమాచారం. 'ప్రాజెక్ట్-కె' షూటింగ్ 2023 తొలినాళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది.అదే ఏడాది చివర్లో లేదా 2024 మొదట్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.