విషాదం.. 'నిరంతరం' దర్శకుడు ఇక లేరు
Popular cinematographer Rajendra Prasad passes away.సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటో
By తోట వంశీ కుమార్
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1995లో రాజేంద్రప్రసాద్ 'నిరంతరం' అనే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాత, రచయితగా కూడా పని చేశారు. ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకోవడంతో పాటు మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాల్లోనూ మెప్పించింది. 'ఆ నలుగురు' చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ ఈయనకు సోదరుడు.
హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ – వేర్ ది ట్రూత్ లైస్', 'ఆల్ లైట్స్', 'నో స్టార్స్' చిత్రాలకు రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలు అన్నింటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా పలు ఇంగ్లీష్, పెర్షియన్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.
రాజేంద్రప్రసాద్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఈయన పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ప్రాథమిక విద్యాభాసం అంతా ఇక్కడే. పుణెలోని ఓ ప్రముఖ ఫిల్మ్ స్కూల్‌లో సినిమాటోగ్రఫి నేర్చుకున్నారు. కాగా.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి విషమించడంతో శుక్రవారం మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.