సినీ పరిశ్రమలో మరో విషాదం.. విమాన ప్రమాదంలో సింగర్ దుర్మరణం
Popular Brazil singer dies in plane crash at 26.ఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 6 Nov 2021 1:26 PM ISTఇటీవల కాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం నాడు విమానంలో వెళుతూ ఉండగా.. ఆ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆమెతో పాటు మేనేజర్ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు పైలట్ , కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు.
మినాస్ గెరైస్ రాష్ట్రంలోని గోయానియా నుండి కరాటింగాకు బయలు దేరిన విమానం ప్రమాదానికి గురైంది. విమానం కిందపడడానికి ముందు విద్యుత్ పంపిణీ లైన్‌ను ఢీకొట్టిందని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ సెమిగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషాద వార్తపై ఆమె అభిమానులు, రాజకీయ నాయకులు, పలువురు గాయనీ గాయకులు, సాకర్ ఆటగాళ్లతో సహా బ్రెజిల్ నలుమూలల నుండి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.
మారిలియా మెండోంకా బ్రెజిలియన్ కంట్రీ మ్యూజిక్ స్టైల్ "సెర్టానెజో" ను పాపులర్ చేసింది. 2019 లాటిన్ గ్రామీని గెలుచుకుంది. చనిపోడానికి ముందు కూడా ఆమె శుక్రవారం నాడు విమానం ఎక్కిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వార్తా వెబ్‌సైట్ G1 ప్రకారం.. విమానం మిడ్‌వెస్ట్రన్ సిటీ అయిన గోయానియా నుండి కరాటింగాకి బయలుదేరింది, అక్కడ 26 ఏళ్ల మెండోంకా ఒక ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంతలో ఆమె చనిపోయిందన్న వార్త విని ఆమె అభిమానులు, ఇతర సింగర్స్ కూడా షాక్ కు గురయ్యారు.