ప్రముఖ రేడియో జాకీ రచన హఠాన్మరణం
Popular Bengaluru RJ Rachana dies due to cardiac arrest.ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన కన్నుమూశారు. బెంగుళూరు
By తోట వంశీ కుమార్
ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన కన్నుమూశారు. బెంగుళూరు జేపీ నగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 39 సంవత్సరాలు. దశాబ్దకాలం పాటు తన మృదువైన స్వరంతో హాస్యాన్ని మేళవించి చేసిన యాంకరింగ్‌తో రచన ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచన హఠాన్మరణం చాలా మందిని షాక్‌కి గురి చేసింది. ఆమె మృతి పట్ల పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం తన గుండెలో నొప్పిగా ఉందని రచన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రచన మరణించినట్లు వైద్యులు తెలిపారు. రచన మృతదేహాన్ని చామరాజ్ పేటలో ఉన్న ఆమె తల్లితండ్రుల నివాసానికి తరలిస్తున్నారు. ఆమె అంత్యక్రియలపై కుటుంబ సభ్యులు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇక రచన అసలు పేరు రెహమానా. రేడియో మిర్చితో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె దశాబ్దకాలం పాటు తన కెరీర్‌ను కొనసాగించారు. కెరీర్ మంచి స్ధితిలో ఉండగా.. ఏడేళ్ళ క్రితం ఆమె తన వృతికి గుడ్‌బై చెప్పారు. అనంతరం శాండల్‌ఉడ్ లోని పలువురు నటీమణులకు డబ్బింగ్ చెప్పారు. అయితే.. కొంతకాలం క్రితం ఆమె డిప్రెషన్‌కు గురైయ్యారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటున్నారు. కనీసం స్నేహితులకు కూడా కలవడం లేదని తెలుస్తోంది. డిప్రెషన్, హైపర్ టెన్షన్ వలనే ఆమెకు గుండెపోటు వచ్చినట్లు స్నేహితులు భావిస్తున్నారు.