సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియిన్ సెల్వన్'
Ponniyin selvan 1 streaming on Amazon Prime.మణిరత్నం కలల ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'
By తోట వంశీ కుమార్ Published on 28 Oct 2022 12:30 PM ISTప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్, శోభితా ధూళిపాళ్లలు ప్రధాన పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం మంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టించింది. తమిళంలో 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని ఎంతో మంది ఎదురుచూస్తుండగా చడీ చప్పుడు లేకుండానే నేటి(శుక్రవారం) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉండటంతో పాటు అదనంగా 199 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్‌ను విడుదల చేయలేదు. నవంబర్ 4 నుంచి ప్రైమ్ సబ్ స్క్రైబర్లు అందరూ ఈ చిత్రాన్ని చూడొచ్చు.
చోళ సామ్రాజ్య వైభవం, చోళ రాజులు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తొలి భాగంలో తమకు ఎదురైన కష్టాల నుంచి వారు ఏ విధంగా బయటపడ్డారు? వారిపై కుట్రలు పన్నినదెవరన్నది చూపించారు. ఆ కుట్రలను ఎలా తిప్పికొట్టారన్నది రెండో భాగంలో చూపించబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.