'వలిమై' సినిమా థియేటర్‌పై పెట్రోల్‌ బాంబుతో దాడి

Petrol bomb hurled at actor Ajith fans in Coimbatore.కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ న‌టించిన చిత్రం ‘వలిమై’. హెచ్‌ వినోద్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2022 12:25 PM IST
వలిమై సినిమా థియేటర్‌పై పెట్రోల్‌ బాంబుతో దాడి

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ న‌టించిన చిత్రం 'వలిమై'. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో తెలుగు యంగ్ హీరో కార్తికేయ విల‌న్‌గా న‌టించారు. జీ స్టూడియోస్‌తో క‌లిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హ్యుమా ఖురేషి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం నేడు (ఫిబ్ర‌వ‌రి 24న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపు రెండేళ్ల త‌రువాత అజిత్ న‌టించిన‌ చిత్రం విడుద‌ల కావ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ సంబ‌రాల్లో అప‌శృతి చోటు చేసుకుంది.

కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్‌ థియేటర్ వ‌ద్ద అభిమానులు సంబురాలు చేసుకుంటుండ‌గా.. పెట్రోల్ బాంబుల‌తో దాడి జరిగింది. బైక్‌పై వ‌చ్చిన ముగ్గురు దుండ‌గులు పెట్రోల్ బాంబుల‌ను విసిరేశారు. ఈ దాడిలో ముగ్గురు అభిమానుల‌కు గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అజిత్ అభిమానులు దాడి చేసిన వారిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. వారు త‌ప్పించుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. వివ‌రాలు సేక‌రించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇలా సినిమా తొలి రోజున ఎందుకు దాడి చేశారు అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇక 'వలిమై' సినిమా విష‌యానికి వ‌స్తే.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌లైన ఈచిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అజిత్ ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్ చేరిన‌ట్లేన‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు.

Next Story