నాకంటే పెద్ద స్టార్స్‌... ఆ హీరోలంటే ఈగో లేదు: పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఉన్న కొందరు హీరోల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్లు తనకంటే..

By Srikanth Gundamalla  Published on  22 Jun 2023 3:18 PM IST
Pawan Kalyan, NO Ego, Prabhas, NTR, Ramcharan

 నాకంటే పెద్ద స్టార్స్‌... ఆ హీరోలంటే ఈగో లేదు: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం.. స్థానిక నాయకుల తీరుని ఎండగడుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ బాగా ప్రశ్నిస్తున్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఉన్న కొందరు హీరోల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్లు తనకంటే పెద్ద హీరోలని.. ఇది చెప్పడంలో తనకెలాంటి ఈగో లేదన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. అభిమానులు పవన్‌ కళ్యాణ్ అంటే ఇది.. ఎప్పడూ సాదాసీదాగానే ఉంటారు..ఈగోలకు పోరు అంటున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ అసలు ఏమన్నారంటే.. ప్రభాస్, మహేశ్‌ బాబు నా కన్నా పెద్ద హీరోలు, అందులో ప్రభాస్‌ అయితే పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. వారు నాకంటే కూడా ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ఏకంగా గ్లోబల్‌ స్టార్స్‌ అయ్యారు. వీరిని ఇతర రాష్ట్రాలు..వేరే దేశాల్లోని ప్రజలు గుర్తిస్తారు. కానీ నన్ను అందరూ గుర్తుపట్టరు. ఇది ఒప్పుకోవడానికి నేను వెనకాడను. ఎందుకంటే నాకు ఎంత మాత్రం ఈగో ప్రాబ్లెమ్‌ లేదు.. అన్నారు పవన్‌ కళ్యాణ్. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, నా జనసేనకు అండగా నిలబడాలని కోరారు పవన్‌ కళ్యాణ్‌. అలానే మీ హీరోనూ అభిమానించండి అని చెప్పారు.

పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారాయి. ఆయన కామెంట్స్‌ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో.. ఆయనకున్న గౌరవం మరింత పెరిగిందని టాలీవుడ్‌లోని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టాలీవుడ్‌లోని హీరోల అభిమానులు పవన్‌ను అభిమానించకుండా ఉండలేరని చెబుతున్నారు.

Next Story