పూర్నియా ఎంపీ పప్పు యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ సాదిక్ ఆలమ్‌కు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా బిష్ణోయ్ గ్యాంగ్ అంటూ పలువురు ప్రముఖులకు బెదిరింపులు వస్తున్నాయి. ఎంపీ పప్పూ యాదవ్ కు మరోసారి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.
నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 2.25 గంటలకు, ఉదయం 9.49 గంటలకు సందేశాలు వచ్చాయని మహ్మద్ సాదిక్ ఆలమ్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తి నుండి ఇంతకు ముందు కూడా పప్పు యాదవ్‌కు బెదిరింపులు వచ్చాయి. అప్పుడు పూర్నియా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేశారు.
"పప్పు యాదవ్ హత్యకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను సంప్రదించారు" అని ఆ సందేశం వచ్చింది. బెదిరింపు సందేశాన్ని పంపిన వ్యక్తి వాట్సాప్ చాట్‌లో టర్కిష్-నిర్మిత పిస్టల్ చిత్రాన్ని కూడా పంచుకున్నాడు. యాదవ్‌ను అంతమొందించడానికి ఈ పిస్టల్ ఉపయోగిస్తామని బెదిరించారు. ఇది మొదటి సంఘటన కాదని, పదేపదే బెదిరింపులకు ప్రతిస్పందనగా తాను ఆరు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశానని పప్పూ యాదవ్ ఈ వివాదంపై స్పందించారు.