ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చిన జాన్ సీనా
ఆస్కార్ అవార్డులను.. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతోంది.
By అంజి Published on 11 March 2024 11:12 AM IST
ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చిన జాన్ సీనా
ఆస్కార్ అవార్డులను.. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఈ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతోంది. 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి ప్రపంచంలోని ప్రముఖ సినీ తారలు హాజరయ్యారు. అయితే ఈ అవార్డుల ఈవెంట్‌లో ఊహించని ఘటన జరిగింది. ఓ నటుడు నగ్నంగా వేదికపైకి వచ్చి మాట్లాడాడు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రముఖ హాలీవుడ్ నటుడు, రెజ్లర్ జాన్ సీనా గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు యాక్షన్ మూవీల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్ సీనా.. తాజాగా 96వ అకాడమీ అవార్డుల వేడుకల్లో ఎవరూ ఊహించని అవతారంలో వేదికపైకి వచ్చాడు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆస్కార్ వేదికపైకి వచ్చి అందరినీ షాక్‌తో పాటు ఆశ్చర్యానికి గురి చేశాడు. 'బెస్ట్ కాస్ట్యూమ్స్' విజేతను కూడా ప్రకటించాడు. 'పూర్ థింగ్స్' సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ లభించింది.
అయితే జాన్‌సీనా ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. 1974లో జరిగిన అకాడమీ అవార్డుల్లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సరిగ్గా 50 ఏళ్ల కిందట జరిగిన ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎలిజబెత్ టేలర్‌ను వేదికపైకి పిలిచిన సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా వేదికపైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రపంచం దృష్టిని ఆకర్షించే ఈ వేడుకల్లో అలాంటి ఘటన అప్పట్లో ఓ సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు జాన్ సీనా ఇలా నగ్నంగా వేదికపైకి వచ్చి మగాడి శరీరం జోక్ కాదు అంటూ ఓ మెసేజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.