విశ్వ‌క్‌సేన్ అలా అనేసరికి బాధేసింది : ఎన్టీఆర్‌

విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన ధ‌మ్కీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హ‌జ‌రుఅయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2023 1:30 PM IST
NTR, Das ka Dhamki pre release

ధ‌మ్కీ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌, విశ్వ‌క్‌సేన్‌

'మాస్ కా దాస్' విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించి, ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రం 'దాస్ కా ధ‌మ్కీ'. ఉగాది కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో శుక్రవారం ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడ‌క‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్‌కు, చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. విశ్వక్ సేన్ అద్భుతమైన నటుడంటూ కితాబిచ్చారు.

'విశ్వ‌క్‌సేన్ వేదిక‌పై మాట్లాడిన‌ట్లు నేనెప్ప‌టికీ మాట్లాడ‌లేను. అంత ఉత్సాహం ఉంది త‌న‌లో. సాధారణంగా నేనే ఎక్కువగా మాట్లాడతానని అనుకుంటే నాకంటే అతడు ఎక్కువగా మాట్లాడతాడు. నా మూడ్ బాగోకపోతే నేను చూసే సినిమాల్లో విశ్వక్ నటించిన "ఈ నగరానికి ఏమైంది" తప్పక ఉంటుంది. అందులో విశ్వ‌క్ న‌టుడిగా కామెడీ చేయ‌కుండానే కామెడీ పండించాడు. ఎంత కామెడీ పండిస్తాడో అంతే బాధ‌ని దిగ‌మింగుకుని క‌నిపిస్తుంటాడు. అలా నటించాలంటే చాలా కష్టం. 'అని ఎన్టీఆర్ అన్నారు.

ఇక.. విశ్వక్ రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తాడ‌న్నాడు తార‌క్‌. "ఒకానొక సమయంలో ఎప్పుడూ రొటీన్ సినిమాలు చేస్తున్నాడనుకున్నప్పుడు అశోక వనంలో అర్జున కల్యాణంతో వైవిధ్యం చూపించాడు.

విశ్వ‌క్ ఎప్పుడూ ఏదో ఒక‌టి నిరూపించుకోవాల‌నే త‌ప‌న‌తో క‌నిపిస్తుంటాడు. ఈ చిత్రం బ్లాక్ బాస్ట‌ర్ కావాలి. విశ్వ‌క్ నాతో మాట్లాడుతూ ఈ చిత్రం కోసం ఉన్న‌దంతా పెట్టేశాను. మీరు ఈ వెంట్‌కు రావాలి అంతే అని చెప్పాడు. అలా విశ్వ‌క్ చెబుతుంటే నాకు చాలా బాధేసింది. ఒక మంచి సినిమా చేయాల‌నే పిచ్చి త‌న‌కెంత‌గా ఉందో అప్పుడు అర్థ‌మైంది. ఇలాంటి పిచ్చి ఉన్న‌వాళ్లే ప‌రిశ్ర‌మ‌ని ముందుకు తీసుకువెలుతారు. అని ఎన్టీఆర్ అన్నారు.

Next Story