ప్రముఖ దర్శకుడు శంకర్‌కు చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు షాకిచ్చింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తన కథను కాపీ కొట్టి ఏంథిరన్ ( రోబో ) చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొంటూ ఆరూర్ తమిళ్‌నందన్ స్థానిక కోర్టును ఆశ్రయించారు. తన కథను 'జిగుబా' పేరుతో 1996 సంవత్సరంలో మొదటిసారి తమిళ పత్రికలో ప్రచురించానని.. మరోసారి 2007 లో 'ధిక్ ధీక్ దీపికా దీపికా' అనే నవలగా ముద్రించారన్నారు. ఈ కథతోనే దర్శకుడు శంకర్ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని.. తనకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించాడు.
దీంతో శంకర్‌ను విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం పలుమార్లు ఆదేశించింది. అయినప్పటికి ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా న్యాయస్థానం ఎదుట కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలో 10 సంవత్సరాలుగా తమ ఆదేశాలు బేఖాతరు చేయడంపై కోర్టు.. దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. రోబో చిత్రం 2010 అక్టోబర్ 2న విడుదలైంది. రజనీకాంత్-ఐశ్వర్యరాయ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.