స్టార్ హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇంట్లో చోరీ జరిగింది. విలువైన వస్తువులతో పాటు ఖరీదైన కెమెరా కూడా కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చోరీ విషయంలో తన ఇంట్లో పనిచేసే 19 ఏళ్ల యువకుడు ధనుష్ పై అనుమానం వ్యక్తం చేసింది. వస్తువులు చోరీకి గురైనప్పటి నుంచి అతడు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. అతడు కొద్ది రోజుల క్రితమే తన ఇంట్లో పనికి కుదిరినట్లు తెలిపింది. చోరికి గురై వస్తువుల విలువ రూ.లక్షకు పైగా ఉంటుందని చెప్పింది.
రంగంలోకి దిగిన పోలీసులు తిరుపూర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో ధనుష్ దాక్కున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తానే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దొంగిలించిన వస్తువులను తన స్నేహితుడి ఇంట్లోనే దాచానని చెప్పాడు. ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తిరిగి వాటిని నిక్కీ గల్రానీకి అప్పగించారు. ఆ వెంటనే నిక్కీ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. ధనుష్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోరిందని సమాచారం. తన వస్తువులు తనకు తిరిగి దొరికాయని.. ఆ సంతృప్తి చాలని ఆమె పేర్కొంది.
ఇక నిక్కీ గల్రానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఆది పినిశెట్టి నటించిన 'మలుపు', 'మరకతమణి' చిత్రాలలో తెలుగువారికి దగ్గరైంది. ఆమె బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ చెల్లెలు. 'డార్లింగ్', 'వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్', 'కడవుల్ ఇరుక్కన్ కుమారు', 'మొట్ట శివ కెట్ట శివ', 'హరహర మహాదేవకి', 'మరగత నానయం' వంటి తమిళ చిత్రాలతో నిక్కీ గల్రానీ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.