తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసిన మహానటుడు నందమూరి తారక రామారావు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్మరణీయుడు. నేడు ఆయన 26వ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. మాట తప్పని ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికి ఆదర్శమన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో స్పూర్తిగా నిలిచారన్నారు. ఇక ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారని.. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన్ను మరిచిపోరని తెలిపారు.
కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610 జీవోను తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. స్థానికతపై ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు జరుగుతున్నాయని, ఉపాధ్యాయులు నిరసనలు తెలుపుతున్నారని అని బాలయ్య అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు.
కాగా.. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. వారు చేస్తున్న ఆందోళనలపై బాలకృష్ణ పై విధంగా స్పందించారు.