మే 28 నుంచి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు : బాలకృష్ణ
Nandamuri Balakrishna comments on NTR 100th birthday celebrations.తెలుగు ప్రజలు ఆరాధ్య ధైవంగా భావించే విశ్వవిఖ్యాత
By తోట వంశీ కుమార్ Published on 21 May 2022 11:57 AM ISTతెలుగు ప్రజలు ఆరాధ్య ధైవంగా భావించే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) శత జయంతి వేడుకలపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటన చేశారు. మే 28 నుంచి శత జయంతి ఉత్సవాలు ఏడాది పాటు జరుగుతాయని, నిమ్మకూరులో నిర్వహించే వేడుకల్లో తాను పాల్గొననున్నట్లు చెప్పారు.
ఈ శతజయంతి వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ భాగస్వాములవుతారని వెల్లడించారు. నెలకు ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. శత జయంతి ఉత్సవాల్లో వారానికి ఐదు సినిమాలు, రెండు సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌లో శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
'మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయ సినిమా తెలుగు సినిమాని తలఎత్తి చూసింది. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు సంస్కృతి తలఎత్తి నిలబడింది. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతోంది. ఆరోజు నుంచి 2023 మే 28 వరకు, 365 రోజుల పాటు శతపురుషుని జయంతి వేడుకలు నేలనలుచేరగులా జరగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. మునుపెన్నడూ కనీవినీఎరుగని విధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది. ఆనందంలో పాలుపంచుకుంటుంది.
మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్లి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ధి వేడుకలను నా చేతుల మీద ప్రారంభిస్తున్నాను. 365 రోజులు వారానికి 5 సినిమాలు,వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కర ప్రధానోత్సవాలు, ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్‌లో ప్రారంభించి ఒంగోలు వెళ్లి మహానాడులో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నారు.' అని నందమూరి బాలకృష్ణ ఆ ప్రకటనలో తెలిపారు.