ఆస్కార్‌లో 'ఆర్ఆర్ఆర్' దూకుడు.. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో 'నాటు నాటు'

Naatu Naatu song shortlisted for Oscars. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Dec 2022 3:47 AM GMT
ఆస్కార్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టించింది. ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం మ‌రో ఘ‌నత‌ను సొంతం చేసుకుంది. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో స్థానం సంపాదించుకుంది. ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' పాట‌కు స్థానం ద‌క్కింది.

గురువారం 10 విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాల షార్ట్ లిస్ట్ జాబితాను అకాడమీ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ తో పాటు భారతీయ సినిమా 'ది లాస్ట్‌ ఫిల్మ్‌ షో' (చెల్లో షో) బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డింది. ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో 15 చిత్రాల‌కు చెందిన పాట‌ల‌ను షార్ట్ లిస్ట్ చేశారు. అందులో 'నాటు నాటు'తోపాటు 'అవతార్‌-2'లోని 'నథింగ్‌ ఈ లాస్ట్‌', 'బ్లాక్‌ పాంథర్‌'లోని 'లిఫ్ట్‌ మీ అప్‌', 'టాప్‌ గన్‌' సినిమాలోని 'హోల్డ్‌ మై హాండ్‌ 'వంటి పాటలు ఉన్నాయి. ఈ 15 చిత్రాల నుంచి జ‌న‌వ‌రిలో ఐదు సినిమాల్ని మాత్ర‌మే ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. ఆ చిత్రాలు మాత్ర‌మే ఆస్కార్‌కు పోటీప‌డ‌తాయి.

ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి రెండో వారంలో బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌, బెస్ట్ యాక్ట‌ర్స్ షార్ట్ లిస్ట్‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. 15 కేట‌గిరిల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ప్ర‌స్తుతం ఒక కేట‌గిరిలో షార్ట్ లిస్ట్ అయ్యింది. దీంతో అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్‌ అవార్డులను ప్రకటించనున్నారు.
Next Story