విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 1:30 PM GMTవిషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్ (55) కన్నుమూశారు. ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గత నెల కోల్‌కతాలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం రషీద్ ఖాన్ ప్రాణాలు కోల్పోయారు. మ్యూజిక్ డైరెక్టర్ రషీద్‌ఖాన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా.. ఆయన ప్రస్తుతం ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.
కాగా.. డిసెంబర్‌లో సెరిబ్రల్ అటాక్‌కు గురైన తర్వాత రషీద్ ఖాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ తర్వాత మొదట టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత రషీద్ ఖాన్‌కు తదుపరి చికిత్స కోల్‌కతాలో ప్రత్యేకంగా కొనసాగించాలని నిర్ణయించారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే గత నెలలో కోల్‌కతాలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. ముందుగా చికిత్సకు సానుకూలంగా స్పందించారు. కానీ.. క్రమంగా మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో రషీద్‌ఖాన్ మంగళవారం ఆస్పత్రిలోనే కన్నుమూశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్‌లో రషీద్ ఖాన్ జన్మించారు. 'జబ్ వి మెట్' అనే బాలీవుడ్ సినిమాలోని ఆవోగే జబ్ తుమ్ పాటతో రషీద్ ఖాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన సంగీత ఉత్సవాలు, కచేరీలలో ఆయన ప్రదర్శనలు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మాస్ట్రోగా కీర్తిని మరింత పటిష్టం చేశాయి. భవిష్యత్ తరాలకు హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని అందించి పరిరక్షించడం, ప్రచారం చేయడంలో దోహదపడ్డారు రషీద్ ఖాన్. కళారంగంలో రషీద్ ఖాన్ సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందింది. 2022లో మ్యూజిక్ డైరెక్టర్ రషీద్ ఖాన్‌కు పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది.