ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం గురించి కుమారుడు అమీన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. రెహమాన్ ఈరోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడానికి గల కారణాన్ని తెలియజేశారు అమీన్. డీహైడ్రేషన్ కారణంగా బలహీనత కారణంగానే ఇలా జరిగిందని స్పష్టం చేశారు. రెహమాన్ కుమార్తె రహీమా కూడా అదే సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అమీన్ పంచుకున్న పోస్టులో "మా ప్రియమైన అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరూ చూపించిన ప్రేమ, మద్దతుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా తండ్రి డీహైడ్రేషన్ కారణంగా కొంచెం బలహీనంగా ఉన్నారు, అందుకే ఆయన్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి కొన్ని సాధారణ పరీక్షలు చేయించాము, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను." అని ఉంది.
ఆదివారం ఉదయం చెన్నైలోని గ్రీమ్స్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఆర్ రెహమాన్ చేరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్డేట్ ను పంచుకున్నారు. రెహమాన్ ఆసుపత్రిలో చేరారనే వార్త విన్న వెంటనే, నేను వైద్యులను సంప్రదించి ఆయన ఆరోగ్యం గురించి విచారించాను, ఆయన క్షేమంగా ఉన్నారని, త్వరలో ఇంటికి తిరిగి వస్తారని వారు చెప్పారు! అది విన్నాక సంతోషంగా ఉందని సీఎం స్టాలిన్ తెలిపారు.