సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశారు. ఇటీవల పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. యువ సంగీత దర్శకుడి మృతితో కోలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల స్నేహితులు, సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం తెలిపారు.
కొద్ది రోజుల క్రితం రఘురామ్ జాండీస్ వ్యాధి బారిన పడ్డారు. అయితే..ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కనీసం నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మరణించారు.
'రివైండ్', 'ఆసై', తో పాటు మూడు తమిళ చిత్రాలకు రఘురామ్ సంగీతాన్ని అందించారు. 2017లో వచ్చిన 'ఒరు కిదైయిన్ కరుణై మను' చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి రఘురామ్ ఇచ్చిన మ్యూజిక్ అందరిని కట్టిపడేసింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం 'సాథియా సొథనై' సినిమాకు పనిచేస్తున్నాడు.