శిల్పాశెట్టి ఇంట్లో పోలీసుల సోదాలు
Mumbai Crime Branch Police Raids Shilpa Shetty house.పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి
By తోట వంశీ కుమార్ Published on 24 July 2021 2:53 AM GMTపోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా, ఆయన భార్య శిల్పా శెట్టి ఇళ్లపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం సాయంత్రం దాడులు చేశారు. ముంబై జుహూ లోని వీరి ఇళ్లపై రైడ్స్ జరిపామని, ఈ కేసులో శిల్పా శెట్టిని కూడా విచారించే అవకాశం ఉందని వారు చెప్పారు. అంధేరీ వెస్ట్ లో వియాన్ అనే కంపెనీ డైరెక్టర్లలో శిల్పా శెట్టి కూడా ఒకరు. ఈ సంస్థ కార్యాలయంపై ఖాకీలు దాడి చేసి.. పోర్న్ మూవీల డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎలెక్ట్రానిక్ డేటా అంతా టెరాబైట్స్ లో ఉందని వారు తెలిపారు. డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు తాము ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. ఇందుకు చాలా సమయం పట్టవచ్చు అని తెలిపారు.
పోర్నోగ్రఫీ వ్యవహారంలో శిల్పాశెట్టికి సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్ కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తన అరెస్టు చట్ట విరుద్ధమని అంటూ రాజ్ కుంద్రా బాంబేహైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఒరిజినల్ ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని, తన అరెస్టు తరువాత తన చేత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని 41 ఏ నోటీసుపై సంతకం చేయమన్నారని, ఇది చట్ట ఉల్లంఘన అని ఆయన ఇందులో పేర్కొన్నాడు. అంతకు ముందు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో తన క్లయింటు కుంద్రా తరఫున మరో పిటిషన్ వేసిన లాయర్.. సంబంధిత వీడియోలను అశ్లీల వీడియోలుగా పరిగణించరాదని కోరాడు. ఏ ప్రాతిపదికపై వీటిని అసభ్యంగా పరిగణిస్తారో చెప్పాలన్నారు. ఏమైనా ఈ కేసులో ఏ క్షణం ఎవరి అరెస్టు జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.