'ఆర్ఆర్ఆర్' చిత్రంపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Minister Perni Nani made key comments on RRR movie ticket rates.సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో
By తోట వంశీ కుమార్ Published on 17 March 2022 9:52 AM GMTసినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)' చిత్రం ఒకటి. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. కరోనా మహమ్మారి కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఇటీవల సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో కి సంబంధించి చిత్ర నిర్మాత దానయ్య, దర్శకుడు రాజమౌళి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. సీఎం సానుకూలంగా స్పందించారంటూ చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గురువారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన చేశారు. దర్శకుడు, నటీనటుల పారితోషికం కాకుండా చిత్ర నిర్మాణానికి రూ.100కోట్లు బడ్జెట్ దాటితే.. ఆయా చిత్రాలు విడుదలైన పది రోజుల వరకు టికెట్ రేటును పెంచుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. అందులో భాగంగానే 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం నుంచి టికెట్ రేటును పెంపుకు సంబంధించిన వినతి పత్రం అందిందన్నారు. జీఎస్టీ, దర్శకుడు, నటీ నటుల పారితోషికం కాకుండా చిత్రానికి రూ.336 కోట్లు ఖర్చుచేసినట్లు అందులో పేర్కొన్నారు.
ప్రస్తుతం సంబంధిత అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆ ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు వెలుతుందన్నారు. ప్రజలపై భారం లేకుండానే ప్రత్యేక టికెట్ ధర ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక రాష్ట్రంలో 20 శాతం సినిమా షూటింగ్ నిర్వహించాలనే నిబంధన 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి వర్తించదన్నారు. జీవో రావడానికి ముందే ఈ చిత్రాన్ని నిర్మించారని అందుకనే దీనికి ఈ నిబంధన వర్తించదన్నారు. కొత్తగా నిర్మించే అన్ని చిత్రాలకు ఈ నిబంధన తప్పకుండా వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని అన్నారు.