మోహన్‌బాబుతో భేటీపై మంత్రి పేర్ని నాని క్లారిటీ.. కాఫీకి రమ్మంటే వెళ్లా
Minister Perni Nani Gives clarity about meeting with Mohan Babu.సీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబుతో ఆంధ్రప్రదేశ్
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2022 6:08 AM GMTసీనియర్ నటుడు, నిర్మాత మోహన్‌బాబుతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలను నటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు నానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా.. గురువారం సినీ పెద్దలు సీఎం జగన్‌తో సమావేశమైన తరువాత మోహన్‌బాబును నాని కలవడంపై మీడియాలో వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. వీటిపై నాని స్పందించారు.
తాను నటుడు మోహన్ బాబును వ్యక్తిగతంగానే కలిశానని, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మీటింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనకు మోహన్‌బాబు ఎప్పటి నుంచో ఆప్తమిత్రుడు అని తెలిపారు. 2002 నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉందని.. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో జరిగిన పెళ్లి కోసం తాను హైదరాబాద్‌కు వెళ్లగా.. అదే సమయంలో కాఫీకి రమ్మని మోహన్‌బాబు నుంచి ఆహ్వానం అందడంతో ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ కాసేపు తామిద్దరం మాట్లాడుకున్నామన్నారు.
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీకి తాను వద్దామనుకున్నా. కాకపోతే ఎవరి నుంచి కబురు అందకపోవడంతో రాలేదని చెప్పారు. ఇక ఇదే విషయాన్ని జగన్‌కు చెప్పమని అన్నారు. అక్కడి నుంచి బయలుదేరే ముందు విష్ణు నన్ను శాలువాతో సత్కరించారని మంత్రి పేర్ని నాని చెప్పారు. అయితే.. మొన్న సినీ ప్రముఖులతో జరిగిన మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇచ్చేందుకే మోహన్‌బాబుని కలిశానని వార్తలు రావడం విచారకరం అని అన్నారు. విష్ణు ఆ విధంగా ట్వీట్ చేశాడని కొందరు మీడియా ప్రతినిధులు మంత్రికి చెప్పారు. దీనిపై విష్ణుకు ఫోన్ చేశానని.. మొదట చేసిన ట్వీట్‌ని మార్చి మరోసారి ట్వీట్ చేశానని విష్ణు చెప్పినట్లు నాని చెప్పారు.
'మీకు మా ఇంట్లో ఆతిథ్యమివ్వడం చాలా సంతోషంగా ఉంది నాని గారు. సినిమా టికెట్ల అంశంపై మీరు తీసుకున్న చొరవకు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రణాళికలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు. ఇండస్ట్రీ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు' అని మంచు విష్ణు తొలుత ట్వీట్ చేశారు. అనంతరం ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి తన నివాసంలో నాని ని సత్కరించడం ఆనందంగా ఉందని.. టాలీవుడ్ ప్రమోజనాలను సంరక్షిస్తున్నందుకు ధన్యవాదాలు అని మార్చి ట్వీట్ చేశారు. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.