మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును చిరంజీవికి అందించారు. ఆయనతో పాటు పలువురు పద్మ అవార్డులు అందుకున్నారు. కాగా.. కళా రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది జనవరి 25 భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ ల్యాండ్‌మార్క్ అచీవ్‌మెంట్‌పై పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు
భారత ప్రభుత్వం పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చిరంజీవితో పాటు పలువురు ఢిల్లీలో పద్మ, పలు అవార్డులు అందుకున్నారు. భారతీయ నటి, నృత్యకారిణి వైజయంతిమాల ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం.ఫాతిమా బీవీ, హోర్ముస్జీ ఎన్.కామా పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది మొత్తం 132 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా.. వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.