గౌత‌మ్ రాజును కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : చిరంజీవి

Megastar Chiranjeevi condolences to Editor Gautham Raju.ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు మ‌ర‌ణం ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2022 7:02 AM GMT
గౌత‌మ్ రాజును కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : చిరంజీవి

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు మ‌ర‌ణం ప‌ట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణం వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు, సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద‌లోట‌ని అన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలియ‌జేశారు.

'గౌతమ్‌ రాజు లాంటి గొప్ప ఎడిటర్‌ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో, ఆయన ఎడిటింగ్‌ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్‌ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్ అంత వేగం. 'చట్టానికి కళ్లు లేవు' చిత్రం నుంచి 'ఖైదీ నం.150' వరకు నా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్‌ రాజు గారు లేకపోవటం వ్యక్తిగతంగా నాకూ, మొత్తం సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను'అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌డుతున్నగౌతమ్‌ రాజు మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 68 సంవ‌త్స‌రాలు. 1954 జ‌న‌వ‌రి 15న ఒంగోల్‌లో జ‌న్మించారు గౌతం రాజు. 1982లో 'దేఖ్ ఖ‌బ‌ర్ ర‌ఖ్ న‌బ‌ర్‌', 'నాలుగు స్తంభాలాట' చిత్రాల‌తో ఎడిట‌ర్‌గా త‌న జీవితాన్ని ప్రారంభించారు. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కిన సుమారు 800 పైగా చిత్రాల‌కు ఆయ‌న ఎడిట‌ర్ గా ప‌ని చేశారు. తెలుగులో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ఆయ‌న ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. 'ఖైదీ నెంబర్‌ 150', 'ఆది', 'గబ్బర్‌సింగ్‌', 'కిక్‌', 'రేసుగుర్రం', 'గోపాల గోపాల', 'అదుర్స్‌', 'బలుపు', 'ఊసరవెల్లి',' బద్రీనాథ్‌', 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌' వంటి చిత్రాల‌తో ఆయ‌న ప్రేక్ష‌కుల మ‌న‌స్సును గెలుచుకున్నాడు. 'ఆది' చిత్రానికి ఉత్త‌మ ఎడిట‌ర్‌గా నంది అవార్డును అందుకున్నారు.

Next Story