చిరంజీవి 154వ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..?
Mega154 Teaser Treat on Diwali.రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలను చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు.
By తోట వంశీ కుమార్ Published on 7 Oct 2022 2:01 PM ISTరీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలను చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. దసరా పండుగ సందర్భంగా ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి రోజునే ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. మెగాస్టార్ తన ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ఈ ప్రమోగం ఫలించిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే చిరంజీవి.. ప్రస్తుతం మూడు చిత్రాలను సెట్స్ పైన ఉంచారు. అందులో బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఒకటి. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గ్యాంగ్ లీడర్ తరహ మాస్ యాక్షన్‌గా చిరు పాత్ర ఉంటుందని టాక్. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారనే ప్రచారం నడుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి పేరుపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
ఓ వార్త ప్రస్తుతం నెటింట హల్ చల్ చేస్తోంది. దీపావళికి చిత్ర పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ను గానీ టీజర్‌ను గానీ విడుదల చేయనున్నారని ఆ వార్త సారాంశం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శృతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.