మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి భావోద్వేగ ట్వీట్‌

Mega Star Chiranjeevi wishes his mother Anjanadevi.మెగాస్టార్ చిరంజీవికి త‌న మాతృమూర్తి అంజ‌నాదేవీ అంటే

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 29 Jan 2022 11:29 AM IST

మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి భావోద్వేగ ట్వీట్‌

మెగాస్టార్ చిరంజీవికి త‌న మాతృమూర్తి అంజ‌నాదేవీ అంటే ఎంత ప్రేమో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ రోజు అంజ‌నాదేవీ పుట్టిన రోజు. అయితే.. ఆమెను స్వ‌యంగా క‌ల‌వ‌లేక‌పోతున్నందుకు చిరంజీవి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల చిరు రెండో సారి క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటున్నారు. శ‌నివారం తన మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

'అమ్మా.. జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌లో ఉన్న కార‌ణంగా ప్ర‌త్య‌క్షంగా నిన్ను క‌లుసుకుని నీ ఆశీస్సులు తీసుకోలేక‌పోతున్నా. అందుకే ఇలా విషెస్ తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నా. అభినందనలతో.. శంకరబాబు' అని త‌ల్లి, భార్య‌తో క‌లిసి దిగిన ఫోటోని చిరు ట్వీట్ చేశారు.

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఆయన్ను తల్లి ప్రేమగా 'శంకరబాబూ' అంటూ పిలుచుకుంటారు. అందుకే తన తల్లికి శుభాకాంక్షలను తెలిపే క్రమంలో త‌న పేరును ఆయన శంకరబాబు అని పేర్కొన్నారు. అభిమానులంద‌రికీ ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి కావొచ్చు.. కానీ త‌న త‌ల్లికి మాత్రం ఎప్ప‌టికీ శంక‌ర‌బాబునే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story