ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను : చిరంజీవి
Mega Star Chiranjeevi sensational comments on Film Industry.సినీ కార్మికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానంటూ
By తోట వంశీ కుమార్ Published on 2 Jan 2022 1:03 PM ISTసినీ కార్మికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానంటూ మెగాస్టార్ చిరంజీవి ముందుకు వస్తుంటారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోధ డయోగ్నొస్టిక్ లైఫ్ టైంహెల్త్ కార్డులను ఆదివారం చిరంజీవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాన్ని అతలాకుతలం చేసింది. నా వంతు సాయం నేను చేశాను. సినీ పరిశ్రమకు కూడా ఏదైనా చెయ్యాలి అని యోధ డయోగ్నొస్టిక్ వారిని అడిగిన వెంటనే వాళ్ళు సరే అన్నారు. వారి డయాగ్నస్టిక్ సెంటర్స్ లో ఉన్న సేవలకు 50 శాతం తగ్గిస్తామని సినీ పరిశ్రమలోని కార్మికులకు ప్రత్యేకంగా హెల్త్ కార్డులు పంపిణి చేయటానికి ముందుకొచ్చినట్లు వెల్లడించారు.
ఈ కార్డులో ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇందులో ఆ కార్డుకి చెందిన వారితో పాటు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ప్రస్తుతం 18 యూనియన్ల కార్డులు రెడీ అయ్యాయి. దాదాపు 7,700 కార్డులు తయారు అయ్యాయి మిగతావి ఈ నెలాఖరు లోపు అవుతాయి. 50 శాతం రాయితీతో ఆ కార్డును వినియోగించుకోవచ్చు అని చిరంజీవి అన్నారు.
ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. గతకొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. ఆ బాధ్యతను మీరు(చిరంజీవి) తీసుకోవాల్సిదింగా కోరుకుంటున్నట్లు వారు అన్నారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. 'పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకు అస్సలు వద్దు. ఓ బాధ్యత గల బిడ్డగా ఉంటాను. అవసరానికి అండగా ఉంటా. అంతేకానీ అనవసర పంచాయతీలు నాకొద్దు. కార్మికులకు ఆరోగ్య, ఉపాధి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా అండగా నిలబడతా 'అని చిరంజీవి అన్నారు.