మెగాస్టార్ చిరంజీవి తన ఫోటో సెషన్ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా అని 'అలయ్ బలయ్' కార్యక్రమంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసిన విషయం తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబుతో పాటు అభిమానులు గరికపాటి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోషల్ మీడియాలో గరికపాటికి వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు చిరంజీవి.
'గాడ్‌ఫాదర్' చిత్ర సక్సెస్ మీట్‌లో భాగంగా విలేకర్లతో చిరంజీవి మాట్లాడారు. ఈ క్రమంలో వివాదంపై స్పందించారు. 'గరికపాటి పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు' అని అన్నారు. చిరంజీవి ఇలా చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది.
ఇక ఈ సమావేశంలో చిరు మాట్లాడుతూ.. ఆచార్య సినిమా పరాజయంతో తాను బాధలో కుంగిపోలేదన్నారు. "బయ్యర్లను కాపాడాలని నేను, రామ్ చరణ్ 80 శాతానికిపైగా పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. ఆర్ఆర్ఆర్ చిత్ర సక్సెస్ కంటే గాడ్‌ఫాదర్ సక్సెస్‌నే చరణ్ ఎక్కువగా ఆస్వాదిస్తున్నాడని" చిరంజీవి చెప్పారు.
ఇక రాజకీయ పార్టీ(ప్రజారాజ్యం) లేకపోవడం వల్ల ప్రస్తుతం బాగానే ఉన్నా. ఒకవేళ ఆ పార్టీ కొనసాగి ఉండుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక దానికే పరిమితం అయ్యేవాణి. నటుడిగా గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆదరణ ఉందో ప్రస్తుతం అలాంటి ఆదరణ ఉందని చిరంజీవి అన్నారు.