మెగా స్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఒకప్పుడే ఆయన బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అంటూ ఎంతో మందిని సేవా కార్యక్రమాల వైపు నడిచేలా చేశారు. తన సినిమాల ద్వారా కూడా ఆయన బ్లడ్ డొనేషన్ గురించి చెబుతూ ఉండే వాళ్ళు. కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మందికి చేదోడుగా నిలిచిన మెగాస్టార్.. ఇప్పుడు ఆక్సిజన్ కొరతను తీర్చే పనిలో పడ్డారు.
జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని మెగా స్టార్ చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఆక్సిజన్ కొరతతో ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. 1998లో చిరంజీవి బ్లడ్ బ్యాంకును స్థాపించగా.. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు.
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామల తన దీనావస్థను మీడియా ద్వారా తెలియజేయగా.. ఆమెకు మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహాయం అందించారు. రూ.1,01,500 మొత్తానికి చెక్కును తన ప్రతినిధుల ద్వారా ఆమెకు పంపించారు. ఆమెకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో సభ్యత్వం ఇప్పించనున్నారు. 'మా'లో సభ్యత్వం వల్ల ఇక ఆమెకు ప్రతి నెలా అసోసియేషన్ నుంచి రూ.6000 పెన్షన్ లభిస్తుంది. చిరంజీవి చేసిన సహాయానికి పావలా శ్యామల కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ తనకు చిరంజీవి రూ.2 లక్షల ఆర్థికసాయం చేశారని ఆమె చెప్పారు. తనకు ఇంతటి సహాయం చేసిన చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె చెప్పారు.