మ‌ణిర‌త్నానికి క‌రోనా పాజిటివ్‌.. ఆస్ప‌త్రిలో చేరిక.. ఆందోళ‌న‌లో అభిమానులు

Mani Ratnam admitted to Chennai hospital after testing Covid positive.క‌రోనా మ‌హ‌మ్మారి పోయిన‌ట్లేన‌ని చాలా మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 July 2022 11:28 AM IST
మ‌ణిర‌త్నానికి క‌రోనా పాజిటివ్‌.. ఆస్ప‌త్రిలో చేరిక.. ఆందోళ‌న‌లో అభిమానులు

క‌రోనా మ‌హ‌మ్మారి పోయిన‌ట్లేన‌ని చాలా మంది బావిస్తున్నారు. దీంతో మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం మానివేశారు. అయితే.. వైర‌స్ క్ర‌మంగా మ‌ళ్లీ విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఆదివారం న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ క‌రోనా బారిన ప‌డ‌గా.. తాజాగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నానికి కూడా క‌రోనా సోకింది.

మ‌ణిర‌త్నం అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకోగా క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయ‌లేదు. సాయంత్రం విడుద‌ల చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

'పొన్నియన్‌ సెల్వన్' అనే చిత్రం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. రూ.500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, కార్తి, త్రిష‌, జ‌యం ర‌వి, ప్ర‌కాశ్ రాజ్, ఐశ్య‌ర్య ల‌క్ష్మి, శోభిత దూళిపాళ్ల, ప్ర‌భు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సెప్టెంబ‌ర్ 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. అందులో బాగంగా గ‌త వారం ఈ చిత్ర టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌ణిర‌త్నంతో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది. అయితే.. ఆ స‌మ‌యంలో క‌రోనా నిబంధ‌న‌ల‌ను ఎవ్వ‌రూ పాటించ‌లేదు. కాగా.. ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం క‌రోనా బారిన ప‌డ‌డంతో ఆయ‌న అభిమానులు అందోళ‌న చెందుతున్నారు.

Next Story