మా ఎన్నిక‌ల‌పై విష్ణు బ‌హిరంగ లేఖ‌.. ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న క‌ష్ట‌న‌ష్టాలు తెలుసు

Manchu Vishnu writes a letter on Maa Elections.మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2021 12:58 PM IST
మా ఎన్నిక‌ల‌పై విష్ణు బ‌హిరంగ లేఖ‌.. ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న క‌ష్ట‌న‌ష్టాలు తెలుసు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం హీరో మంచు విష్ణుతో పాటు సినీ నటులు ప్రకాశ్ రాజ్‌, జీవితా రాజశేఖర్‌, హేమ పోటిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. 'మా' ఎన్నికల్లో పోటీపై మంచు విష్ణు లేఖ విడుదల చేశారు. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న మా అధ్య‌క్ష ప‌ద‌వికి తాను నామినేష‌న్ వేస్తున్నాన‌ని చెప్పారు. ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న క‌ష్ట‌న‌ష్టాలు త‌న‌కు తెలుసున‌ని, సినీ పరిశ్రమకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉందని చెప్పారు. పరిశ్రమ రుణం తీర్చుకోవడం, సేవ చేయడమే తన కర్తవ్యమని ప్రకటించారు.

'మా అధ్య‌క్ష ప‌ద‌వికి నేను నామినేష‌న్ వేస్తున్నాన‌ని మా కుటుంబ స‌భ్యులైన మీ అంద‌రికి తెలియ‌జేయడం గౌర‌వ‌ప్ర‌దంగా భావిస్తున్నాను. సినిమా ప‌రిశ్ర‌మ‌ని న‌మ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మ‌న ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, క‌ష్ట‌న‌ష్టాలు.. ప్ర‌త్య‌క్షంగా చూస్తూ పెరిగిన నాకు మా కుటుంబ స‌భ్యుల బావాలు, బాధ‌లు బాగా తెలుసు. నాకు,నా కుటుంబానికి ఎంతో పేరు ప్ర‌తిష్ట‌లు అందించిన తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవ‌డానికి ఈ ప‌రిశ్ర‌మ‌కు సేవ చేయ‌డం నా క‌ర్త‌వ్యంగా భావిస్తున్నాను. నా తండ్రి మోహ‌న్‌బాబు మా అసోసియేష‌న్‌కు అధ్య‌క్షుడిగా చేసిన సేవ‌లు, వారి అనుభ‌వాలు, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఇప్పుడు నాకు మార్గ‌ద‌ర్శ‌కాల‌య్యాయి. గ‌తంలో మా అసోసియేష‌న్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన‌ప్పుడు మా బిల్డింగ్ ఫండ్‌కి నా కుటుంబ త‌రుపున నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చులో 25శాతం అందిస్తాన‌ని మాట ఇచ్చాను. భ‌వ‌నం నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా నేను కొన్ని స‌ల‌హాలు, సూచ‌న‌లు చేశాను. అవి మా కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో ద్విగిజ‌యంగా అమ‌లు చేశాను. మా వ్య‌వ‌హారాల‌న్నింటీని అతి ద‌గ్గ‌ర‌గా, జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన నాకు మా కుటుంబ స‌భ్యుల‌కు ఏది అవ‌స‌ర‌మో స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌, అనుభ‌వం ఉంది. మ‌న ఇంటిని మ‌న‌మే చ‌క్క‌దిద్దుకుందాం. క‌ష్టాల్లో ఉన్న క‌ళాకారుల‌కు ఎప్పుడూ అండ‌గా ఉంటాం. అందుబాటులో ఉంటాం. మా అసోసియేష‌న్ కి అధ్య‌క్షుడిగా నా సేవ‌లు సంపూర్ణంగా అందించాల‌నుకుంటున్నాను. పెద్ద‌ల అనుభ‌వాలు, యువ‌ర‌క్తంతో నిండిన కొత్త ఆలోచ‌న‌లు క‌ల‌గ‌లిపి న‌డ‌వాల‌నే నా ప్ర‌య‌త్నం, మీ అంద‌రి స‌హ‌కారంతో విజ‌య‌వంతం కావాల‌ని ఆశిస్తున్నా.'. అని మంచు విష్ణు లేఖ‌లో పేర్కొన్నారు.


Next Story