ఫోటో షేర్ చేసి శుభ‌వార్త చెప్పిన మంచు మ‌నోజ్‌

Manchu Manoj’s new film gets a crazy title.ఫోటో షేర్ చేసి మ‌రీ తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2023 10:41 AM IST
ఫోటో షేర్ చేసి శుభ‌వార్త చెప్పిన మంచు మ‌నోజ్‌

"నా హృద‌యానికి చేరువైన ఓ ప్ర‌త్యేక‌మైన వార్త‌ను గ‌త కొంత‌కాలంగా నాలోనే దాచుకున్నాను. నా జీవితంలో మ‌రో ద‌శ‌లోకి అడుగుపెడుతున్న సంద‌ర్భంగా ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను జ‌న‌వ‌రి 20న చెబుతా. ఎప్ప‌టిలాగే మీ అంద‌రి ఆశీస్సులు కావాలి." అని మంచు మ‌నోజ్ రెండు రోజుల క్రితం ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో మంచు వారి అబ్బాయి చెప్పే శుభ‌వార్త ఎంటా అని అత‌డి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. పెళ్లి గురించా లేక సినిమా గురించా అన్న చ‌ర్చ మొద‌లు కాగా.. దానికి పుల్‌స్టాప్ పెట్టేశాడు మ‌నోజ్.

ఫోటో షేర్ చేసి మ‌రీ తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పేశాడు. త‌న కొత్త సినిమా ప్రాజెక్టును ప్ర‌క‌టించాడు. "చాలా కాలంగా నేను సినిమాల్లో న‌టించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ మీరంద‌రూ నాపై చూపిస్తున్న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. నేను కూడా ఎంతో కొంత ప్రేమ‌ను మీకు తిరిగి ఇవ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. వాట్ ద ఫిష్ అనే కొత్త చిత్రంతో మీ ముందుకు రాబోతున్నా. ఈ చిత్రం మీ అంచ‌నాల‌ను అందుకోవ‌డంతో పాటు మీకు ఓ కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది." అని అంటూ మంచు మ‌నోజ్ ట్వీట్ చేశాడు. దీనికి త‌న కొత్త సినిమా పోస్ట‌ర్‌ల‌ను సైతం జ‌త చేశాడు.

మంచు మ‌నోజ్ వెండితెర‌పై క‌నిపించ‌క చాలా సంవ‌త్స‌రాలైంది. క‌రోనాకు ముందు ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో ఓ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు చెప్పాడు. శ్రీకాంత్ రెడ్డి అనే ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. అప్ప‌ట్లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. అయితే.. ఆ చిత్రంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి అప్‌డేట్ లేదు. ఈ రోజు మ‌నోజ్ కొత్త సినిమాను ప్ర‌క‌టించ‌డంతో అహం బ్రహ్మాస్మి సంగ‌తి ఏంటి అని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రీ దీనిపై మంచు మ‌నోజ్ స్పందిస్తాడో లేదో చూడాలి.

Next Story