కన్నడ టీవీ నటికి వేధింపులు, నిందితుడు అరెస్ట్
కన్నడ, తెలుగు టెలివిజన్ నటి ఓ వ్యక్తి నుంచి నిరంతర ఆన్‌లైన్ వేధింపులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By - Knakam Karthik |
కన్నడ టీవీ నటికి వేధింపులు, నిందితుడు అరెస్ట్
కన్నడ, తెలుగు టెలివిజన్ నటి ఓ వ్యక్తి నుంచి నిరంతర ఆన్‌లైన్ వేధింపులకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్య సందేశాలు, వీడియోలు పంపుతూ ఆమెను ఇబ్బంది పెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే — “నవీంజ్” పేరుతో ఉన్న ఓ వ్యక్తి మొదట ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నటి దానిని తిరస్కరించినప్పటికీ, అతను పదే పదే అసభ్య కంటెంట్ పంపడం కొనసాగించాడు. ఆమె బ్లాక్ చేసిన తర్వాత కూడా వేధింపులు ఆగలేదు. నిందితుడు పలు నకిలీ ఖాతాలు సృష్టించి, మూడు నెలల పాటు అసభ్య వీడియోలు, సందేశాలు పంపాడని నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
“నేను బ్లాక్ చేసిన తరువాత కూడా అతడు అసభ్య వీడియోలు, సందేశాలు పంపడాన్ని ఆపలేదు. అనేక ఫేక్ ప్రొఫైళ్లు సృష్టించి వేధింపులు కొనసాగించాడు. దీనివల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను,” అని నటి ఫిర్యాదులో తెలిపారు. నవంబర్ 1న నటి నందన్ ప్యాలెస్ సమీపంలోని నాగరభావిలో నిందితుడిని ఎదుర్కొని మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసి, నిందితుడిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతను న్యాయహిరాసతలో ఉన్నాడు. ఈ కేసు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.